రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న వారికి ఇవ్వటం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీలు, నవోదయ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలున్నా వీరికి రూ.35 వేలకు మించి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రభుత్వాదేశాల కాపీ జతచేసినా పట్టించుకోవడం లేదు.
గతేడాది బకాయిలు ఇటీవలే విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నా కూడా అది కాలేజీలకు అందలేదు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీసీలు, ఈబీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేవారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఫీజులు కొంత వరకు చెల్లిస్తుండటంతో 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీ, ఈబీసీలందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చారు. దీంతో వందల కోట్లలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక్క సారిగా వేల కోట్లలోకి వెళ్లిపోయింది. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఫీజులు కాలేజీలకు సక్రమంగా చెల్లించడం లేదు. 2018 –19 సంవత్సరానికి రెండు క్వార్టర్లు రీయింబర్స్ మెంట్ చెల్లించారు. మొదటి క్వార్టర్‌లో రూ. 576.25 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.537.10 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.39.15 కోట్లు మొదటి క్వార్టర్‌కు బకాయి ఉంది. ఇలా రూ.133.28 కోట్లు ఇంకా చెల్లించాలి.
రెండు క్వార్టర్‌లకు కలిపి ఈయేడాదిలో రూ.162.43 కోట్లు విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉంది. అలాగే నాలుగో క్వార్టర్ రిలీజ్‌లో జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులకు ఏడాది వృధా అవుతుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదు. పైకి ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిస్థాయిలో ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నా అమలు కావట్లుదు. రాష్ట్రంలోని 321 ఇంజనీరింగ్ కాలేజీలలో సుమారు 90 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో కలిపి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్‌కు అర్హులైన వారు (ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని కోర్స్ లు కలిపి) 16,00,054 మంది ఉన్నారు. 8,352 కాలేజీల్లో చదువుతున్న వీరికి ప్రభుత్వ నిర్దేసించిన మేరకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,555.26 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో ఇంజినీరింగ్ విద్యార్థికి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.35 వేలు మాత్రమే. అది కూడా సకాలంలో ఇవ్వడం లేదు. సగటున రూ.65 వేలు సొంతంగా చెల్లిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలోప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు ఈ ఎందరో విద్యర్ధులు ఈ సమస్యలను వివరించారు.
దీనిపై జగన్ తీవ్రంగా చలించిపోయారు. సమగ్ర మార్పులు, చేర్పులతో ఆర్థిక ఇబ్బందులు లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఎన్నికోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. ఎన్ని లక్షల రూపాయలైనా సరే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తాం. మెస్ చార్జీల (వసతి, భోజనం కోసం)కోసం అదనంగా ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తాం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్ల కూడదనేది మా ఆలోచన. పిల్లల చదువును ప్రభుత్వం చూసుకుంటుందనే భరోసా కల్పిస్తాం. దీంతో పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు ఆలోచించకుండా సంతోషంగా వారి పనులు వారు చేసుకునే అవకాశం కలుగుతుంది. పేదల చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన స్ఫూర్తితో నేను రెండడుగులు ముందుకు వేస్తానంటూ జగన్ మరో నవరత్నంతో ప్రజలముందుకు వస్తున్నారు.