టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన నూతన బాద్యతల్లో దూకుడు పెంచారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. `ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు.. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. “ అని హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని కేటీఆర్ వివరించారు. “ప్రధాని మోదీ, అమిత్ షా, ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోంది. విపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు లొంగలేదు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైంది. ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్ ది“ అని తెలిపారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ఎంపీ వినోద్‌కుమార్ బరిలో దిగనున్నారని కేటీఆఱ్ ప్రకటించారు. తద్వారా టీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి అభ్యర్థిని ఆయన వెల్లడించినట్లయింది.