వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు కుట్రదారులు ఎవరున్నారో బహిర్గతం చేయాలని ఆపార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. గతంలో ఘటన జరిగినసపుడు సాక్ష్యాత్తూ రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఇవాళ సీపీ లడ్డా ప్రెస్‌మీట్‌లో వెల్లడైన నేపధ్యంలో కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎట్టి పరిస్థితిలో బహిర్గతంకాకుండా, బహ్యప్రపంచానికి తెలియకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఒక్క శ్రీనివాస్‌పైనే చుట్టి, కర్త, కర్మ, క్రియ అంతా శ్రీనివాస్ అనేవిధంగా చేసిన వైనాన్ని కుట్రగా భావిస్తున్నామన్నారు.
కేసు రిజిస్ట్రర్ చేసే సమయంలో కూడా 120 బీ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈకేసులో 307 మాత్రమో నమోదు చేశారని, కుట్రకోణంపై విచారించాలనే ఆలోచన లేదన్నారు. రాష్ట్ర పోలీసులు అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం కేసునమోదు చేసిన తరువాత కూడా కుట్ర కోణంలో విచారణ చేయలేదన్నారు. పాత్రదారులు, సూత్రదారులను బహిర్గతం చేయకూడదన్నదే పోలీసుల ఉద్దేశమన్నది ఈరోజు పోలీసు కమిషనర్ లడ్డా ప్రెస్‌మీట్ సారాంశమన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ లో జగన్ అడిన పబ్లిసిటీ స్టంట్ నాటకం అని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం తప్పని మాత్రమే ఈ రోజు లడ్డా ప్రెస్‌మీట్‌లో చెప్పారన్నారు. 120బీ కేసు నమోదు చేసి ఎందుకు విచారణ చేయలేదని, సూత్రదారులను బహిర్గతం ఎందుకు చేయడంలేదని నిలదీశారు.
ఇవాళ జన్మభూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. అంటే ప్రధాని మోడీ తలుచుకుంటే కోర్టును ప్రభావితం చేసి జగన్‌పై ఉన్న కేసులను కొట్టేయిస్తాడన్నది మీ అభిప్రాయమా అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటివి చంద్రబాబుకు బాగా అలవాటు అని, వైయస్ జగన్ అలాంటి వాటికి దూరమన్నారు. చంద్రబాబు మీద 27 కేసులు ఇవాల్టికీ స్టే రూపంలో ఉన్నాయంటే అవి ముందుకు మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు వైయస్ జగన్‌పై ఉన్న కేసులు గాలి బుడగ లాంటివని పేర్కొన్నారు. ఈ కేసుల్లో వైయస్ జగన్ ప్రమేయమే లేదన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదురించిన మరుక్షణమే అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు.
కాంగ్రెస్ నేత శంకర్‌రావుతో లేఖ రాయించి, టీడీపీ నేతలు అశోక్‌గజపతిరాజు, ఎ్రరనాయుడితో కేసులు ఏ విధంగా నడిపించారో కోర్టులోని ఏ కూర్చిని, గోడను అడిగినా కూడా స్పష్టంగా చెబుతుందన్నారు. చంద్రబాబుకున్న అలవాట్లు ఇతరులపై రుద్దడం సరికాదన్నారు. చంద్రబాబు ఎంత మభ్యపెట్టినా జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబు చూపిన కాఠిన్యం ప్రజలందరూ చూశారన్నారు. పాడేరు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముపై మావోయిస్టులు దాడి చేసి హత్య చేస్తే వెంటనే ఎన్‌ఐఏకు బదిలీ చేశారని, జగన్ కేసును ఎందుకు ఎన్‌ఐఏకు అప్పగించడం లేదని నిలదీశారు. ప్రతిపక్ష నేతపై హత్యయత్నం జరిగితే సీఎం, డీజీపీ, మంత్రులు హేళనగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. విచారణను చంద్రబాబు ప్రభావితం చేశారని, ఈ కేసును ఆలస్యం చేస్తే ఇందులో సాక్ష్యాలు ఆవిరవుతాయని ఇవాళ హైకోర్టులో ఫిర్యాదు చేసామన్నారు.