తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన విజయాన్ని అందించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు చెక్కుచెదరని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు. కేసీఆర్ రాష్ర్టానికి సరైన నాయకుడని ప్రజలు భావించారు. రాష్ట్రవ్యాప్తంగా 28లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఉద్యమ స్ఫూర్తితో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలి. 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. పేదప్రజలు టీఆర్‌ఎస్‌పై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో సనత్‌నగర్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు.
డివిజన్ల వారీగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాం. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16స్థానాలు సాధించాల్సిన అవసరముంది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. దేశవ్యాప్తంగా బీజేపీ విశ్వాసాన్ని కోల్పోతుంది. టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలుంటే ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. దేశంలోని రైతులందరికీ లాభం జరిగే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఆలోచనే నాంది కావడం గర్వకారణం. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని కేటీఆర్ వివరించారు.