బుల్లితెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట హిందీలో ఈ కార్యక్రమం మొదలు కాగా, ఆ తర్వాత పలు భాషలలోను రూపొందింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో నిర్వాహకులు వరుస సీజన్స్ జరుపుతున్నారు. హిందీలో బిగ్ బాస్ 12 సీజన్స్ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ హొస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజన్ 12 కార్యక్రమం నిన్న ఫినాలే జరుపుకుంది. ఇందులో శ్రీశాంత్, దీపక ఠాకుర్‌లు టాప్ ఫైనలిస్ట్‌లో ఉండగా, వారిని వెనక్కి నెట్టేసి టైటిల్ అందుకుంది ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో నటి దీపికా కక్కర్. ఇక భారత క్రికెటర్ శ్రీశాంత్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, సెకండ్ రన్నరప్‌గా దీపక్ ఠాకూర్ నిలిచారు.
బిగ్ బాస్ టైటిల్ విజేతని గెలుచుకున్న దీపిక ట్రోఫీతో పాటు 30 లక్షల క్యాజ్ ప్రైజ్ గెలుచుకుంది. 105 రోజుల పాటు హౌజ్‌లో సంతోషంగా గడిపినట్టు ఈ సందర్భంగా తెలిపింది. దీపిక ఫ్యామిలీని స్టేజ్‌పైకి ఆహ్వానించిన సల్మాన్ వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. శ్వేతా తివారీ, శిల్పా శిండే, జుహీ పర్మార్ తర్వాత బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న టీవీ నటిగా దీపిక కకర్ గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్.. దీపికని విజేతగా ప్రకటించడంతో ఆమె ఎంతో భావోద్వేగానికి గురవుతూ కన్నీటి పర్యంతమైంది. దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం కూడా ఆమె గెలుపుని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో నాలుగో స్థానంలో రొమిల్ చౌదరి ఉండగా, ఐదో స్థానాన్ని కరణ్‌వీర్ బోహ్రా చేజిక్కించుకున్నారు.