సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి భారతదేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో సమావేశమై ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని గులాబీ బాస్ నిర్ణయించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకోవడానికి వేయి గజాల స్థలం కేటాయించే అవకాశముంది. సంక్రాంతి పండగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. రెండు మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ కార్యాలయం సంసిద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసు నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంపిలు శుక్రవారం కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తారు. ఎంపీలతోపాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా పరిశీలనలో పాల్గొంటున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధ్యాహ్నం ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశముంది. గులాబీ దళపతి నిర్ణయం అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.