ఇటీవల జరిగిన చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరాజయంతో భారతీయ జనతాపార్టీలో మథనం మొదలైంది. ఈ ఓటమికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్ గాంధీ ఎటాక్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ పట్టుదలతో ఉన్నారు. ఎన్నికలకు వెళ్లేముందు రైతాంగానికి భారీ తాయిలం ప్రకటించాలని నిర్ణయించారు.
ఎన్నికల వ్యూహరచనపై ప్రధాని మోడీ తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ వ్యూహంతో ముందడుగేసినందున, దానికి దీటైన పథకం ప్రకటించి ప్రతిపక్షానికి దీటైన కౌంటర్ ఇవ్వాలని భేటీలో తీర్మానించినట్లు సమాచారం. ప్రధానితో సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, పార్టీ చీఫ్ అమిత్‌షా, వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్ హాజరైనట్లు సమాచారం. విపక్షనేత సవాల్‌కు దీటైన జవాబిచ్చేలా రైతులకు తాయిలాలు ఇవ్వడం అనివార్యమని మోడీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో, రుణమాఫీ బాటలోనే మరొక అడుగు ముందుకేసేలా సరికొత్త పథకం దిశగా చర్చించారు. పంట ఉత్పత్తులకు లభించే కనీస మద్దతుధర, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని భర్తీచేసే అంశమూ ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ వంటి చోట్ల అమలవుతున్న ఇతర ప్రత్యామ్నాయ, ఆకర్షణీయ విధానాలపైనా విస్తృత చర్చజరిపారు. అదేవిధంగా గతంలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అమలు చేసిన ధరల వ్యత్యాసం పథకం, మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో అనుసరించిన డైరెక్ట్ ఫిక్స్‌డ్ సబ్సిడీ స్కీమ్ ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని పార్టీ వర్గాల సమాచారం.
కాగా,. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమాపై పూర్తిగా అధ్యయనం చేయాలని వీటికి అనుగుణంగా పథకాలు రూపొందించి ప్రజల ఓట్లు అడగాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.