ఆసీస్ ప్లేయర్స్ మాటల యుద్ధం రోజురోజుకి మితిమీరిపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్.. ఇండియన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్టులో రెండవ రోజు పెయిన్ తన మాటలతో రోహిత్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. రోహిత్ సిక్సర్ కొడితే .. ముంబై ఇండియన్స్‌కు తాము మద్దతు ఇవ్వనున్నట్లు పెయిన్ చెప్పాడు. పెర్త్‌లో జరిగిన రెండవ టెస్టు సమయంలోనూ ఆసీస్ కెప్టెన్.. విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా పెయిన్.. తన సహజ ధోరణిని మార్చుకోలేక రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పెయిన్.. షార్ట్‌మిడ్‌లెగ్‌లో ఉన్న ఆసీస్ ప్లేయర్ ఆరన్ ఫించ్‌తో మాట్లాడాడు.
నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫించ్‌తో మాట్లాడుతున్నట్లు పెయిన్ నటించాడు. కానీ బ్యాటింగ్ క్రీజులో ఉన్న రోహిత్‌ను తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్‌లో నువ్వు అన్ని జట్లకు ఆడావు కదా అని ఫించ్‌తో పెయిన్ అన్నాడు. లేదు.. బెంగుళూరుకు ఆడలేదని ఫించ్ చెప్పాడు. అవునా, బెంగుళూరుకు ఆడలేదా. ఇప్పుడు రోహిత్ సిక్సర్ కొడితే, నేను ముంబై ఇండియన్స్‌కు సపోర్ట్ ఇస్తానని పెయిన్ అన్నాడు. అయితే ఆసీస్ కెప్టెన్ తన మాటలతో ఎంత ఉసిగొలిపే ప్రయత్నం చేసినా.. రోహిత్ మాత్రం ఎటువంటి అసహనానికి లోనుకాలేదు. ఆ తర్వాత రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడో టెస్ట్ తోలి రోజు మయాంక్ పై ఆసీస్ వ్యాఖ్యాత జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు.