తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం హైకోర్టును విభజిస్తూ ప్రకటన వెలువరించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే ఏపీకి ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా గుర్తించారు. జనవరి 1వ తేదీ నుంచి అందులోనే తెలంగాణ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని, అమరావతిలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు నూతన భవనాల్లో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదల తేదీకి, అపాయింటెడ్ డేకు మధ్య కనీసం మూడునెలల వ్యవధి ఉంటుందని ముందుగా అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అదేమీలేదని కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌తో స్పష్టమైంది.
దీంతో జనవరి ఒకటి నుంచే నేలపాడు నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ హైకోర్టుకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లిన జస్టిస్ సుభాష్‌రెడ్డి తెలంగాణకు ఆప్షన్‌ను ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు ఎవరన్నది నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న తొట్టతిల్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఏపీ చీఫ్ జస్టిస్ ఎవరన్నది స్పష్టత రాలేదు. ఉత్తరాఖండ్ సీజేగా ఉన్న జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌ను ఏపీకి కేటాయించినప్పటికీ, ఆయన తిరిగి వెనక్కివచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది తేలలేదు. ఇరురాష్ర్టాల హైకోర్టు సీజేలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని వివరాలు:
*రాజ్యాంగంలోని 214 అధికరణం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని పేర్కొంటున్నది.
*ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో హైకోర్టు విభజనతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజనపై అన్ని విషయాలను పొందుపర్చారు.
*ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 30 క్లాస్ ఏ ఇరురాష్ట్రాలకు ప్రత్యేక హై కోర్టు ఏర్పాటయ్యేవరకు హైదరాబాద్‌లోని హైకో ర్టు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని చెప్తు న్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం రెం డు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలి.
*ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31 సబ్ సెక్షన్ 1 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటుచేయాలి. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుంది.
*ఏపీ హైకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండాలనేది రాష్ట్రపతి నోటిఫై చేస్తారని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31, సబ్‌సెక్షన్ 2 స్పష్టం చేస్తున్నది.
*యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ టీ ధన్‌గోపాల్ కేసులో హైదరాబాద్‌లోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును రెండు ప్రత్యేక హైకోర్టులుగా విభజించడానికి ఎటువంటి ఆంక్షలు లేవని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీంతోపాటు రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటుచేస్తూ జనవరి 1, 2019 లోపు నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది.
*పై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30, సబ్‌సెక్షన్ 1, క్లాస్ ఏ.. సెక్షన్ 31, సబ్ సెక్షన్ 1, 2ల ద్వారా దఖలుపడ్డ అధికారాల ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 1, 2019 నుంచి అమరావతి కేంద్రంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టును హైకోర్టు ఆఫ్ తెలంగాణగా ఏర్పాటుచేశారు.