రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన తరువాత ఇచ్చిన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ.. హోదా సాధన కోసం పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది. అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్‌సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి.ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించి రైతుల వలసల గురించి చంద్రబాబు చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో యూ టర్న్ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు.హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అనేక రూపాల్లో పోరాటాలు చేశారని తెలిపారు.