ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు మరోమారు వివాదాస్పదంగా మారింది. అసోంలో ప్రధాని నరేంద్రమోడీ అతిపెద్ద రైలురోడ్డు వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. బోగిబీల్ వంతెన అని పిలిచే నిర్మాణానికి రూ.5,900 కోట్లు వ్యయమయ్యాయి. అసోం ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆ వంతెన నిర్మాణంపై అంతటా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం ఆవేదనతో ఉన్నారు. అందుకు కారణం ఉంది. ఆ వంతెనకు 1997లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు.
మరి ప్రారంభోత్సవానికి పిలిచారా? అని మీడియా అడిగితే అయ్యోరామా నన్నెవరు గుర్తుంచుకున్నారులే బాబూ అని నిట్టూర్పు విడిచారట. కశ్మీర్‌కు రైల్వేలైను, ఢిల్లీ మెట్రో, బోగిబీల్ వంతెన తానే మంజూరు చేశానని, మూడింటికి మొదటి విడుతగా వందేసి కోట్లు విడుదల చేశానని వివరించారు. నన్ను ఆహ్వానించకపోయినా కొన్ని పత్రికలు తన హయాంలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టు అని ప్రస్తావించానని పేర్కొన్నారు. అయినా అధికారంలో ఎవరుంటే వారి చేతే శంకుస్థాపన చేయిస్తారు. ప్రారంభోత్సవాలూ అంతే. ఆ మాత్రం తెలియకుండా ఆనాడు దేశప్రధాని ఎలా అయ్యారో ఏమో అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.