వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎట్టకేలకు తీపికబురు రానుంది. జీఎస్టీ పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో ఎగవేతలు తగ్గి, వసూళ్లు బాగా పెరుగుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో ఇప్పుడున్న 12-18% రేట్లను ఏకం చేసి మధ్యలో మరో రేటు తీసుకొస్తామని తన ప్రణాళికను వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన తన ఫేస్‌బుక్ బ్లాగ్‌లో ప్రత్యేక కథనం రాశారు.
‘‘ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత దారుణమైన పరోక్ష పన్నుల విధానం ఉన్న దేశం భారత్. పన్నులు వేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. రెండూ కలిపి 17 రకాల పన్నులు వేసేవి. వీటి తనిఖీకి 17 మంది ఇన్స్‌పెక్టర్లు ఉండేవారు. వ్యాపారులు 17 రిటర్నులు, 17 అసెస్‌మెంట్లను సమర్పించాల్సి వచ్చేది. పన్ను భారం కారణంగా ఎక్కువ మంది ఎగ్గొట్టడానికే మొగ్గు చూపేవారు. అంతర్రాష్ట్ర వాణిజ్యం దారుణంగా ఉండేది. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటినుంచి పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 17 రకాల పన్నులు ఒక్కటయ్యాయి. భారత్ మొత్తం ఏకమార్కెట్‌గా అవతరించింది.“ అని వెల్లడించారు.