సభలో సాక్షాత్తు సీఎంతోపాటు సభాపక్ష నేతలు అధ్యక్షా అని పిలిపించుకునే ఆ హోదా అందరిని వరించకున్నా దానికున్న ఆర్బాటం వల్ల భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనిపి అనిపిస్తోంది. భారీ కాన్వాయితో ఊరేగే ఆ పదవి అంటే మోజు ఉన్నా, ఆ కుర్చీ ప్ర భావంతో తరువాత భవిష్యత్ ఉండదనే బెంగతో ‘వామ్మో స్పీకర్’ హోదానా?, ఆ అట్టహాసం, ఆర్బాటం నాకొద్దు నాయనో.. అని చాలామంది భయపడుతున్నారు. ఉమ్మడి శాసనసభలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలలో గతంలో స్పీకర్ పదవిని నిర్వహించినవారు ఎవరూ అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. అది తొలి తెలంగాణ ప్రభుత్వంలో మొదటి సభాపతిగా పనిచేసిన సిరికొండ ఓటమితో మరోసారి రుజువైంది. అది ఆ కుర్చీ ప్రభావమో లేక శాపమో తెలియదుకాని ఆ పదవిని నిర్వహించిన ఎంతటివారైనా మరోసారి సభలో అడుగుపెట్టడంలేదు. అందుకే ఆ పదవి అంటే అంతా హడలిపోతున్నారు.
గత ప్రభుత్వాలలో స్పీకర్ హోదాను నిర్వహించినవారంతా ఓడిపోయారు. తెలుగుదేశం హయాంలో ఆ పదవిని నిర్వహించిన నారాయణరావు, ప్రతిభ భారతి, యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్‌లో ఆ హోదాలో రాణించిన దుద్దిళ్ల శ్రీపాదరావు, కెఆర్ సురేష్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్‌రెడ్డి వంటి దిగ్గజాలు తరువాత శాసనసభ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఇంతకుముందు స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి దృష్టికి తీసుకురాగా దానికి ఆయన స్పందిస్తూ గతంలో సభాపతిగా పనిచేసినవారు హైదరాబాద్‌ను వదిలి ప్రజల వద్దకు రాలేదని, దానితో వారు ఓడిపోయారని అన్నారు. తాను అందుకు భిన్నంగా సభా సమయంలోనూ, అనంతర కాలంలో సైతం నెలలో 25రోజులు నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగం పంచుకున్నానని చెప్పారు. అన్నివర్గాల ప్రజాదరణ ఉన్న తాను తిరిగి గెలిచితీరుతానని అనేకసార్లు చెప్పారు. రాజకీయ పరిశీలకులు, అటు విశ్లేషకులు సిరికొండ భారీ మెజారిటీతో గెలుస్తాడని భావించారు. తీరా నియోజకవర్గానికి జరిగిన చతుర్ముఖపోటీలో ఫలితాల వెల్లడితో సిరికొండ మూడో స్థానానికి దిగజారిపోయారు. దానితో ఏది ఏమైనా స్పీకర్‌గా పనిచేసినవారు అనంతర ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనేది సిరికొండ ఓటమితో మరోసారి స్పష్టమైంది.