కొడంగల్‌లో తనను ఓడించే మగాడెవ్వడు లేడంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కామెడీగా మారిపోయిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రాజకీయాలకు మారు పేరు అయిన రేవంత్ రెడ్డి తీరు నుంచి కొడంగల్ ప్రజలకు విముక్తి కలిగించే ప్రక్రియలో భాగంగా టీఆర్ఎస్ ఈ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకొని రేవంత్‌ను ఓడించింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న రేవంత్ రెడ్డి తన గురించి కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్నారని.. మహబూబ్ నగర్ ఎంపీ గా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఓ కామెడీ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఓ కామెడీగా మారిందంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీలోని రాజకీయాలను పలువురు ఉదహరిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం ఓడిన రేవంత్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. జైపాల్ రెడ్డి లాంటి సీనియర్లు మహబూబ్ నగర్ బరిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దూకుడు వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందన్న విమర్శల మధ్య మళ్లీ ఆయనకు టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తన నియోజకవర్గంపై సరిగా దృష్టి సారించకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా తిరిగాలనే ఆరాటంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని దీంతో ఓటమి తప్పలేదంటున్నారు. ప్రజాభిప్రాయానికి మధ్య కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 2018 కు మే 2019కు మధ్య స్వల్ప సమయమే ఉంది. అధికారం చేపట్టిన టీఆర్ఎస్ కే ఎంపీ స్థానాలు కూడా గంపగుత్తగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్‌కు టికెట్ ఇచ్చి మరీ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.