తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అంటున్న చంద్రబాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలుసని అందుకే ఓటమి భయంతోనే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డిలు చంద్రబాబుకు కోవర్టులుగా మారారు. కోవర్టులను వాడుకుని రాహుల్ గాంధీని దెబ్బతీయాలనేది చంద్రబాబు ప్రయత్నం. రాష్ట్ర విభజన సమయంలో చివరి బంతి అన్న కిరణ్ ఇప్పటివరకు ఎక్కడున్నారు.’’ అని ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి 25 స్థానాలు ఇస్తే పత్యేక హోదా సాధిస్తామని చెప్పే చంద్రబాబు.. ఇప్పడు 20 మంది ఎంపీలు ఉంటే ఏం సాధించారని ఆనం రామనారాయణరెడ్డి పశ్నించారు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో కొనసాగి సాధించలేని విభజన హామీలను 25 మంది ఎంపీలు ఉంటే సాధిస్తాననటం హాస్యాస్పదమన్నారు. ప్రతీ మీటింగ్లో అమరావతిని షాంగై, సింగపూర్ చేస్తామని చెప్తున్నారు కానీ నాలుగున్నరేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.తిరుపతిని సిలికాన్ సిటీగా పేరు మార్చాలనే పతిపాదన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.