ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎద్దేవా చేయడం ఆయన ఘాటు స్పందించారు. ఈ మేరకు పలు ట్వీట్లలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘మీరు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేయొచ్చు. మళ్లా కాంగ్రెస్‌తో జతకట్టొచ్చు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే మూడో కూటమి ఎలా అని హేళన చేస్తారు. ఆయన కూడా మీలాగే ఇతర రాష్ట్రాల సీఎంలను కలిస్తే స్వార్థం అంటారు. మీరు చేస్తే కాపురం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుందా లయ్యర్ నాయుడుబాబు?’ అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తీరును ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘చంద్రం సారు ఏ శంకుస్థాపన చేసినా తన బినామీలు, బంధువుల రియల ఎస్టేట్ ప్రయోజనాల కోసమే. సైబర్ సిటీ చుట్టూ జయభేరి ఆస్తులే కనిపిస్తాయి. అమరావతి చుట్టూ 60 వేల ఎకరాలు ఆయన మనుషులవే. నిర్ణయానికి ముందే సమాచారం ఇచ్చి రియల్ ఎస్టేట్ ప్రారంభిస్తారు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం శోచనీయం’ అంటూ మండిపడ్డారు. ‘2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం,పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తో 5లక్షల ఓట్లతో టీడీపీ గెలిచింది.మీరు నమోదుచేయించిన 52లక్షల దొంగ ఓట్లు,దొంగ నోట్లు, ప్రజా విజయాన్ని ప్రభావితం చేయలేవు.తెలంగాణా ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి మీ పట్ల క్లారిటీ వచ్చింది.తూర్పున సూర్యుడు ఉదయించడమంత సత్యం ఇది’ అని మరో ట్వీట్లో ఘాటుగా స్పందించారు.
‘ఏపీలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు బాబూ?తెలంగాణాలో గెలిస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు గదా. అదే హామీని ఏపీలో అమలు చేయాలి కదా?ఎందుకు దాట వేస్తున్నారో చెప్పాలని యువత ప్రశ్నిస్తోంది చంద్రంనాయుడు గారిని’ అని ఎద్దేవా చేశారు.