తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఇద్దరూ పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన అనుచరులు, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సండ్ర జంపింగ్ ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు కూడా చేసినట్లుగా రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఖమ్మంలో రహస్యంగా కలుసుకుని చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కారెక్కుతారనే ప్రచారం సాగుతోంది. కాగా, డిసెంబర్ 21న మండలిలోని కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ఎల్పీలో శుక్రవారం విలీనమయ్యారు. వీరి బాటలోనే టీడీపీ ఎమ్మెల్యేకు కూడా నడవనుండటం సంచలనంగా మారింది.
Tags AP CM CHANDRA BABU joining to trs kcr trs