అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేసిన విజ్ఞప్తి చేసిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, టీ సంతోష్‌కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, కే దామోదర్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగా గుర్తిస్తూ.. వారికి మండలిలో ప్రత్యేక సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కే దామోదర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, ఆకుల లలిత, టీ సంతోష్‌కుమార్ సమావేశమై కాంగ్రెస్ ఎమ్మెల్సీలలో అత్యధికశాతం మందిమి పార్టీ మారుతున్నందున తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ తీర్మానం చేసుకున్నారు. అనంతరం మండలి చైర్మన్ కే స్వామిగౌడ్‌ను కలిసి లేఖ అందజేశారు. వారి వినతిని పరిశీలించిన చైర్మన్ కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు బులెటిన్ విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. ప్రస్తుతం షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. వారి పదవీ కాలం కూడా మార్చితో ముగియనుండటంతో ఆ తరువాత మండలిలో పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోనుంది.
Post Views: 256