సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో వర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా వర్మ వ్యవహరించారని కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వర్మపై క్రిమినల్, పరువు నష్టం కేసులో పెట్టాలని పోలీసులను కోరారు.
అయితే, ఈ ఎపిసోడ్‌పై టీడీపీ నేతలకు తగిన రీతిలో వర్మ సై అంటే సై అంటున్నారు. తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. టీడీపీ నేతలు ఇలా ఫిర్యాదులు చేశారో లేదో.. వర్మ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదు లెటర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేను అక్కడికి వెళుతున్నా.. ఫిర్యాదు మీద ఫిర్యాదు చేస్తానని కామెంట్ పెట్టారు.దీంతో అవాక్కవడం టీడీపీ నేతల వంతు అయింది.