శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి, తపన తన గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు తన వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందన్నారు. చంద్రబాబు లా తనకు కాసులంటే కక్కుర్తి లేదని, చంద్రబాబులా తాను కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఎన్నో విధాలుగా కక్షగట్టినా నిర్భయంగా ఎలా ఉన్నాడో వివరించారు. తన లో ఉన్న కసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమేనని, రైతుకు వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేయాలని, ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం అందిచగలగాలి. ప్రతి పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదువుకోగలగాలి. పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోగలగాలి. మద్యపానాన్ని నిర్మూలించగలగాలి. మంచిపనులతో తన తండ్రిలా తానూ ప్రతి మనిషి గుండెల్లో కలకాలం నిలిచిపోవాలనేదే తన కసి అని చెప్పారు జగన్. అసలె ఎక్కడ వెతికి చూసినా చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టో కనిపించడం లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని మాయం చేసారన్నారు. చంద్రబాబులా మోసం చేయడం తనకు చేతకాదన్నారు. నవరత్నాలతో పాటు ప్రజలకు కావాల్సినవేమిటో పాదయాత్రలో అడిగి తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. పాదయాత్రలో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు ప్రజలతో మమేకమై ప్రజలతోనే సమాధానం చెప్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. సంవత్సరకాలంగా ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతున్నా అదే జన ప్రభంజనం.. అదే వెల్లువ.. అదే అభిమానం.. అదే కోలాహలం.. రోజురోజుకూ వటుడింతై అన్నట్టు పెరుగుతున్న జగన్ ఆదరణను చూసి టీడీపీ ప్రభుత్వం కళ్లు పచ్చబడుతున్నాయి.
అయితే గతంలో పట్టపగలే భద్రతా వలయాలను ఛేదించుకుని ఆగంతకుడి రూపంలో జగన్ పై హత్యాయత్నం జరిగినా, ప్రాణం తీసేందుకు సిద్ధపడిన వ్యక్తి వెనుక పెద్ద తలలే ఉన్నట్టు అనుమానాన్నాయి. తీగలాగితే కదిలే డొంకను చప్పుడు చేయకుండా దాచిపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. తన ప్రాణాలకే ప్రమాదం పొంచిఉందని తెలిసినా జగన్ భయపడలేదు. వెనక్కు తగ్గలేదు. గాయం మానకుండానే పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ఆరోజునుంచీ జనం జగన్ ను సొంత ఇంటి మనిషిలా చూసుకున్నారట.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.. పార్టీ నాయకులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండడం చూసి జగన్ చలించిపోతున్నారట.. అలాగే ఇటువంటి బెదిరింపులు, దాడులు తన ఆశయాన్ని చంపలేవని చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు జగన్. అలుపెరుగని యోధునికి గాయాలు అడ్డంకి కాదని కదన రంగంలో కాలుపెట్టారు. ఆరోజున జగన్ ని చూసిన ప్రజలు ఓ రాజకీయ యోధుడిని చూస్తున్నట్టు ఉందంటున్నారు ప్రజలు.