సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు. శుక్రవారం విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. పాట విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే ఈ పాటను దాదాపు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో టీడీపీ వర్గాల్లో గుబులు మొదలైంది. సినిమాలో చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ సాంగ్ ఉందంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా పాటను చిత్రీకరించారని మండిపడుతున్నారు. రాంగోపాల్‌వర్మపై కర్నూలుతోపాటు పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వర్మకు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.