జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు అమ్మాయిలు.. తమ వలపులతో వల వేసి ఆపై దోపిడీలకు పాల్పడుతున్నబ్యాచ్ ను ప్రత్తిపాడు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ మూర్తి వివరాలు వెల్లడించారు. ఎంతో కాలంగా జాతీయ రహదారిపై ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు కలిసి ఒక టీంగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరంతా అర్ధరాత్రి దాటిన తరువాత జాతీయ రహదారిపైకి వస్తుంటారు. వీరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపుతారు. ఆడవారిని చూసి ఆపిన డ్రైవర్లు కాని, ఇతర వాహనదారులు కాని వారితో పాటు వ్యభిచారం చేయడం కోసం పక్కకు వెళతారు. అంతలో అక్కడికి నలుగురు మగవారు వచ్చి దాడి చేసి అతని వద్ద నున్న విలువైన వస్తువులను దోచుకుంటారు. ఇది ఎంతో కాలంగా సాగుతూనే వుంది. ఈ తరహా నేరాలపై ఇంత వరకు ఎక్కడా కేసులు నమోదు కాక పోవడం గమనార్హం! ఇటీవల జరిగిన కొన్ని నేరాల ఆధారంగా ప్రత్తిపాడు ఎస్‌ఐ బాలకృష్ణ దృష్టికి ఇలాంటి నేరాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున తన సిబ్బందితో చినకోండ్రుపాడు కాటూరి మెడికల్ కళాశాల వద్ద మాటువేశారు. ప్రత్తిపాడుకు చెందిన తన్నీరు అంకమ్మరావు తన ఆటోలో కాటూరి వైపు వెళుతుండగా మహిళలు ఆపడం, పక్కకు తీసుకెళ్లడం, అంతలో నలుగురు మగవారు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్ వద్ద నున్న రూ. 4750 నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా 25 సంవత్సరాలలోపు వారు కావడం గమనార్హం! చితల దుర్గా ప్రసాద్, దొడ్డా రాజకుమార్, వేముల అనిల్, జి.ఏసుబాబు, షేక్ మాబులా, అంగడి లక్ష్మి, వంతల తిరుపతమ్మలను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
