తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు అభినందనలు తెలిపారు.
తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహముద్ అలీ, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పద్మారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి కళాకారుల ఆటపాటలు, నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తనకు కేటాయించిన చాంబర్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేటీఆర్ కు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం:
ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయల్దేరే ముందు కేటీఆర్.. తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లిదండ్రులు కేసీఆర్, శోభా ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ కు.. సోదరి కవిత ఆయన నుదుట తిలక దిద్ది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ బయల్దేరారు.
ఉద్యమంలో క్రియాశీలక పాత్ర:
కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి.. రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో.. విజయవంతంగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి.. ప్రజలకు చేరువయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తనకు అప్పగించిన ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కేటీఆర్ పని సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకొని ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ శక్తి, సామర్థ్యాలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తనయుడికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర సమితిపై పూర్తి అవగాహన ఉన్న కేటీఆర్.. ఇప్పటికే పార్టీ పటిష్టతకు అనేక రకాలుగా కృషి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకిచ్చిన బాధ్యతను భుజాలపై వేసుకొని.. పార్టీని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపించారు. అలాగే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తను ఇంచార్జిగా వ్యవహరించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అందరితో మన్ననలు పొందారు. ఈ క్రమంలో కేటీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను గుర్తించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో పార్టీని సమర్థవంతంగా, క్రమశిక్షణతో నడిపిస్తాడన్న నమ్మకం కుదరడంతో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.
మోడ్రన్ లీడర్ గా పేరు తెచ్చుకున్న కేటీఆర్.. తన వాగ్దాటితో అన్ని వర్గాలను ఆకట్టుకుంటారు. అంతే కాదు.. పార్టీని కానీ, తనను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే తనదైన శైలిలో పంచ్ లు వేసి దిమ్మ తిరిగేలా చేస్తారు. చమత్కారాలతో నవ్వులు పూయిస్తారు. సాటి మనిషికి సాయపడి ఎందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మోడ్రన్ లీడరే కాదు.. ఆయన మాస్ లీడర్ కూడా.. ప్రాంతానికి, పరిస్థితులకు తగ్గట్టుగా తన అహాభావాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు.
ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుస్థాపించారు. అమెరికాలో ఉన్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వర్తించేందుకు 2006లో హైదరాబాద్ కు వచ్చారు. 2006 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం 2009 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఉద్యమానికి బాసటగా నిలిచారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డిపై 68,220 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్ రావుపై కేటీఆర్ 53,004 ఓట్ల మెజార్టీతో గెలిచి సిరిసిల్ల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయ కేతనం ఎగురవేశారు.
కేటీఆర్ 1976, జులై 24న కేసీఆర్, శోభా దంపతులకు జన్మించారు. కేటీఆర్ సోదరి ఎంపీ కవిత. ఇక కేటీఆర్ కు భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య ఉన్నారు. రామారావు తన విద్యాభ్యాసాన్ని కరీంనగర్, హైదరాబాద్ లో పూర్తి చేశారు. మెడిసిన్ ఎంట్రెన్స్ రాయగా.. కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టం లేక నిజాం కాలేజీలో బీఎస్సీ(మైక్రో బయాలజీ) పూర్తి చేశారు. పుణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేసి.. ఆ తర్వాత అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్ మెంట్ అండ్ ఈకామర్స్ లో ఎంబీఏ అభ్యసించారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్టు మేనేజర్ గా ఉద్యోగం చేశారు.