ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆయా పార్టీల లీడర్లు. తూర్పు గోదావరి జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన 16చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీటిలో కనీసం ఏడు చోట్ల అభ్యర్థులను మార్చాలని టీడీపీ అధిష్ఠానం యోచిస్తోందట.. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల కొత్తవారు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. ఈ విషయంలో వైసీపీ తెలుగుదేశం కంటే చాలా ముందుంది.. వైసీపీ ఇప్పటికే జిల్లాలో మెజార్టీ సీట్లలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. సీనియర్ నాయకుడు, బుచ్చయ్య చౌదరి వంటి వారికి సైతం సీట్ల విషయంలో ఇంకా చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేద.. వీరితో పాటు కొందరు పార్టీకోసం పనిచేసిన సీనియర్లు సైతం టికెట్లు కేటాయించేటపుడు తమను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారట.
వీరితో పాటు కొందరు యువ నాయకులు సైతం టికెట్లు అడుగుతున్నారట.. అయితే కొందరు మాత్రం అధిష్టానం తమను పట్టించుకోకపోతే రెబల్స్ గా అయినా బరిలోకి దిగి గెలుపోటములను ప్రభావితం చేయాలని చూస్తున్నారట. ఈ విషయంలో వైసీపీ నేతల స్ట్రాటజీని మెచ్చుకోవాలి. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లోనూ జగన్ పార్టీ నేతలను సమస్వయం చేసారు. ఎక్కడైతే ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారో అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధులను దాదాపుగా ప్రకటిస్తూ ముందుకెళ్లారు.. ఇబ్బందులు ఎదురవుతాయన్న చోట పార్టీ నాయకులను, క్యాడర్ ను సమన్వయం చేసారు. కానీ టీడీపీ ఇప్పటివరకూ అభ్యర్ధులను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంది.
దీంతో క్యాడర్ లో అసంతృప్తితో పాటు తిరుగుబాటు మొదలవుతోంది. ఇప్పుడు అంత కొంపలు ముంచే అంశం కాకపోయినా వైసీపీ సిద్ధంగా ఉన్నపుడు మనం ఆ పరిస్థితిలో లేము అని టీడీపీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. కాపుల్ని మోసం చేయడం, రైతులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో రుణమాఫీ కాకపోవడం, దివిస్ ఫ్యాక్టరీ భూముల వివాదం వంటి కారణాలతో తూర్పు గోదావరిలో టీడీపీ ఈ జిల్లాలో మూడు నాలుగు స్థానాలకే పరిమితం కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.