ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా….బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను తిరిగి ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు తిరిగి పాత పద్దతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు.