రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
ప్రజల అమాయకత్వం, అత్యశతో ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితుల ప్రమేయం లేకుండానే, బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. సైబర్‌క్రైమ్‌లకు సంబంధించి గత ఏడాది 325 కేసులు నమోదు కాగా ఈ ఏడాది నవంబరు వరకు 405 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నేరగాళ్లు చాలావరకు ఇతర రాష్ర్టాలకు చెందిన వారే. వీరిని పట్టుకోవడం కోసం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. వారు ఆయా రాష్ర్టాల్లో గాలించి నిందితులను పట్టుకొస్తున్నారు. వీటన్నింటినీ విశ్లేషిస్తే.. ప్రజల అవగాహనలోపంతోనే ఎక్కువగా సైబర్‌నేరాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చూసినప్పుడు 2014 నుంచి 2016 మధ్య సైబర్ నేరాల్లో 20 శాతానికి పైనే పెరుగుదల నమోదైంది. 2014లో 9,622 సైబర్ నేరాలు నమోదైతే.. 2016లో 12,317కు పెరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత నేరాల్లో 40 శాతం పెరుగుదల కనిపించింది. 2017లో కేవలం మొదటి నాలుగు నెలల్లోనే దేశవ్యాప్తంగా 3,474 నేరాలు నమోదయ్యాయి. ఇందులో 2వేల నేరాలు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సంబంధించినవే కావడం ఆందోళన కలిగించే అంశం. వీటన్నింటికీ అవగాహన, అప్రమత్తత ఒక్కటే పరిష్కార మార్గం.