ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
పెథాయ్ తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. తుఫాను నేపథ్యంలో సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంగోలు, కాకినాడ మధ్యలో పెథాయ్ తీరందాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభావం వల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాంధ్రలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.