సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని సర్కారును గద్దెదించడమే లక్ష్యమని ప్రకటించి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి మరీ పొత్తులు కుదుర్చుకొని…స్వల్పకాలంలో ఎన్నికల్లో చిత్తు అయిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆలస్యంగా జ్ఞానోదయం కలిగిందంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుతో అధికార పార్టీని గద్దె దించాలని భావించిన మాస్టారు ఆఖరికి గులాబీ పార్టీ దాటికి క్లీన్ బౌల్డ్ అయిపోయన అనంతరం తత్వం బోధపడిందని చెప్తున్నారు. ఇందుకు నిదర్శననే…తాజాగా ఆయన చేసిన ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే తమకు గెలిచే అంత సీన్ లేదని గ్రహించిన కోదండరాం మాస్టారు ఇప్పుడు కూటమిపై నింద వేసి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర్యంగానే పోటీకి సిద్ధపడుదామని పార్టీ అధినేత కోదండరాం సంకేతాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందని… సైద్ధాంతికంగా కూటమి కొనసాగుతుందని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చేలా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.