అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా..
ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించారని తిప్పేస్వామి తరుపు లాయర్లు వాదించారు. ఆయన భార్య ఉద్యోగాన్ని కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని.. కర్ణాటకలో తనపై ఉన్న కేసుల వివరాలును సైతం పొందుపరచలేదని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. ఈరన్న ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేల్చింది. దాంతో ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పడమే కాకుండా రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పష్టం చేసింది. దాంతో నిన్న తిప్పేస్వామిని వైసీపీ నేతలు కలిసి అభినందించారు. ఈ రకంగా వైసీపీకి మరో ఎమ్మెల్యే కలిసి వచ్చినట్టయింది.
మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన తిప్పేస్వామే వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్ది అని వైసీపీ ప్రకటించింది. దీంతో తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు. కానీ తనకు ఈ 6నెలల ఎమ్మెల్యే పదవీకాలం కంటే వచ్చే ఎన్నికలు ఎంతో ముఖ్యమని 2019 ఎన్నికల్లో మడకశిరలో వైసీపీ జెండా ఎగురవేస్తామని తిప్పేస్వామి చెప్తున్నారు. టీడీపీ అభ్యర్ధి ఈరన్న ఈ నాలుగేళ్లలోనూ అనేక అక్రమాలు చేసారని వాటిని ఎండగడుతామంటున్నారు. ఈక్రమంలో గతంలో వైసీపీ నుంచి ఈ జిల్లాలో కదిరి, ఉరవకొండ నియోజకవర్గాలు గెలవగా ఈ సారి మరో ఆరుస్థానాలు కచ్చితంగా గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. జగన్ చరిష్మా, చంద్రబాబు అవినీతి పాలన కలిసొస్తుందని చెప్తున్నారు.