తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు సర్కారు ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే…మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఆయన మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ పట్ల పలువురు ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. త్వరలో వీరి చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కలవరం మొదలైంది.
ఊహించని రీతిలో ముందస్తును ముందుకు తెచ్చిన గులాబీ దళపతి అదే రీతిలో రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించి షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు ఓటమి పాలవడం ఆ పార్టీలో కలవరానికి దారితీస్తోంది. అయితే, దీనికి కొనసాగింపుగా తాజాగా కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి కనబర్చుస్తున్నట్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో గులాబీ పార్టీ ఎత్తులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ…. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్ కుస్తీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నాయకులవైపు అనుమానపు చూపులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి గులాబీ గూటికి చేరబోయే ఎమ్మెల్యేలు ఎవరా?అంటూ అంతర్గత సంభాషణల్లో ఆరా తీస్తున్నారు. పార్టీ మారకుండా ఉండాలని కొందరిని బతిమాలుకుంటునట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.