క్రెడిట్/డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి.
మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్ డెబిట్ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని, ఈ ఏడాది చివరి లోగా ప్రతి ఒక్కరూ చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఎందుకంటే భారత్ లో చాలామంది మాగ్నటిక్ స్ట్రైప్ డెబిట్, క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. వీటిని హ్యాక్ చేయడం, క్లోనింగ్ ద్వారా సొమ్ముని స్వాహా చేయడం వంటి ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ చిప్ ఆధారిత కార్డులను ప్రవేశపెట్టాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో బ్యాంకులు 2016 జనవరి 31 తర్వాత కొత్తగా ఖాతాలు తెరిచిన కస్టమర్లకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను ఇచ్చాయి. అయితే ఇంకా చాలామంది మాగ్నటిక్ స్ట్రైప్ కార్డులను వాడుతుండటంతో వాటిని అప్ గ్రేడ్ చేయించుకోమని బ్యాంకులు కస్టమర్లని కోరుతున్నాయి. అంతేకాదు EMV చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు పూర్తి భద్రతతో కూడుకున్నవని బ్యాంకులు కస్టమర్లకి భరోసా ఇస్తున్నాయి.ఈ జూన్ 2018వరకు చూసుకుంటే 39.4 మిలియన్ల క్రెడిట్, 944 మిలియన్ల డెబిట్ కార్డులున్నాయని ఆర్ బీఐ అంచనాకొచ్చింది.
మరి మీ కార్డులు చిప్ ఆధారిత కార్డులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. మీ క్రెడిట్/డెబిట్ కార్డు ముందువైపు బంగారు రంగులో చిన్న చిప్ ఉంటుంది. అది ఉంటే మీది ఈఎంవీ కార్డే. లేదంటే మార్చుకోవాల్సి ఉంటుంది.