రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనత ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇక్కడికే కాలేదు. మరో ప్రపంచ ఘనత సొంతమైంది.
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో 2019-35 కాలానికి గాను జరిగిన గ్లోబల్ ఎకనామిక్ రిసెర్చ్ నివేదికలో తెలంగాణ రాష్ట్ర రాజధానికి 8.47 శాతం వార్షిక సగటు వృద్ధి ఉండొచ్చని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే పదిహేనేండ్లలో జీడీపీ పరంగా అత్యంత వృద్ధిదాయక నగరాల అంచనాల్లో హైదరాబాద్ కూడా ఉన్నది. టాప్-20 నగరాల్లో భారత్‌కు చెందినవే 17 ఉండగా, అందులో భాగ్యనగరానికి నాలుగో స్థానం లభించడం గమనార్హం. 9.17 శాతంతో సూరత్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి రెండు స్థానాల్లో ఆగ్రా (8.58 శాతం), బెంగళూరు (8.50 శాతం) ఉన్నాయి. టాప్-10లో నాగ్‌పూర్ (8.41 శాతం), తిరుప్పూర్ (8.36 శాతం), రాజ్‌కోట్ (8.33 శాతం), తిరుచ్చి (8.29 శాతం), చెన్నై (8.17 శాతం), విజయవాడ (8.16 శాతం) ఉన్నాయి. భారతీయ నగరాలు కాకుండా చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిదాయక నగరాల్లో నాం ఫే మొదటి స్థానంలో ఉంది.
జీడీపీ పరంగా ఉత్తర అమెరికా, ఐరోపా నగరాలపై ఆసియా దేశాల నగరాల పెత్తనానికి 2027లో బీజం పడుతుందని తాజా నివేదిక అభిప్రాయపడింది. అన్ని ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల నగరాల జీడీపీతో పోల్చితే ఆసియా నగరాలన్నింటి జీడీపీ అధికంగా ఉంటుందని పేర్కొన్నది. ముఖ్యంగా భారత్ పాత్ర కీలకమని, అందులోనూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలదే హవా అని వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ జీడీపీ వృద్ధిరేటులో ఆసియా దేశాలే కీలకమని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తేల్చిచెప్పింది.