వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. అలాగూ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు హత్య కేసుల్లో భాగంగా కోర్టుల చుట్టూ తిరిగారు..
అనంతరం తమ రాష్ట్రాలకు ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు.. కేంద్రమంత్రి ఉమాభారతి, అమిత్ షా, మాయావతిలు పలుకేసుల్లో ఏళ్ల తరబడి కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. పైన చెప్పబడిన వారు సమకాలీన రాజకీయాలలో కేసులను ఎదుర్కొని కూడా ప్రజల నమ్మకాన్ని పొంది ప్రజాకర్షక ముఖ్యమంత్రులుగా కీర్తింపబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా చాలా కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొని ప్రధానమంత్రి అయ్యారు. ఆయనను నరరూప హంతకుడు అని కూడా ప్రత్యర్ధ పార్టీల నేతలు విమర్శించారు. అయితే జగన్ విషయంలో తెలుగుదేశం నేతలు పదేపదే జగన్ పై ఒకే విమర్శను ప్రయోగిస్తున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే జగన్ ఒక్క స్టే తెచ్చుకుని ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండదు.
కేవలం జగన్ నిజాయితీగా విచారణకు హాజరవుతున్నారు. ప్రజలు కూడా తాము ఎన్నుకునే నాయకుడు రాష్ట్రాన్ని సక్రమంగా డీల్ చేస్తాడా.? సవాళ్ళను ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉందా లేదా అని ప్రథమంగా చూస్తారు. తర్వాత ఇచ్చిన హామీలు, తర్వాత క్యారెక్టర్ ని బట్టి ఆకర్షితులవుతారు. జగన్ ప్రతిపక్షనేతగా 5ఏళ్లలో అసెంబ్లీలో, ప్రజల్లో తన మాటలద్వారా సమర్థతను నిరూపించుకున్నారు. హత్యాయత్నం మొదలుకుని అనేక సందర్భాలలో హుందాతనం ప్రదర్శించి దూరంగా ఉన్న వర్గాలకు కూడా చేరువయ్యాడు. సంవత్సరకాలంపాటు చేసిన పాదయాత్ర ద్వారా తానొక సీరియస్, సిన్సియర్, కష్టపడే తత్వమున్న రాజకీయ నేతగా ప్రజల్లో ముద్రవేసుకున్నాడు.
2002 మొదలుకుని 2014వరకు మోడీ పై నరహంతకుడన్న విమర్శను ప్రత్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ దేశ ప్రజలు మోడీ సమర్ధతకు, మాటలకు ఆకర్షితులై మోడీనే ప్రధానమంత్రిని చేశారు. జయలలిత, నితీష్ వంటి నేతల విషయంలోనూ సవాళ్ళను ఎదుర్కోగలిగిన సమర్ధతే వారిని గెలిపించింది. 2014లో పవన్, మోడి, చంద్రబాబు అనుభవశాలి అనే ప్రచారం, ధన ప్రవాహం, జగన్ పై కేసుల వివాదం, కుల, మత లెక్కలు, అబద్ధపు హామీల వంటి ఎన్నో అంశాలతో కొద్ది తేడాతో జగన్ ఓటమిపాలయ్యారు. రేపు జగన్ విషయంలో ప్రత్యర్ధపార్టీలు, చంద్రబాబు అండ్ కో చేసే విమర్శలు నూటికి నూరు శాతం కంఠశ్వాసగా మిగిలిపోనున్నాయనేది మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.