ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దినమిది. ప్రజాతీర్పు మరో రోజులో స్పష్టంకానుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడోతేదీన ఎన్నికలు ముగిసిన శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగు కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎంలను) ఇప్పటికే సంబంధిత కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలన్నింటిని స్ట్రాంగ్‌రూంలకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడంచెల పటిష్ఠ భద్రతతో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. కేంద్ర బలగాల ప్లాటూన్ మొదటి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. రెండు, మూడుచోట్ల రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించారు. వీటికి వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద నిరంతర నిఘా కొనసాగుతున్నది. అనుమతి లేకుండా ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం డేగ కండ్లతో కాపలా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.శాసనసభ నియోజకవర్గాల్లోని ఓట్లను లెక్కించడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 13 నెలకొల్పగా, మిగతా 30 జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఉంటాయి. ఈ కేంద్రాల్లో ఆయా జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
14 టేబుల్స్‌కు ఒక రౌండ్
కౌంటింగ్ సందర్భంగా 14 టేబుల్స్‌కు ఒక రౌండ్ చొప్పున పూర్తవుతుంది. ఒక్కో రౌండులో 14 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఒకసారి 14 టేబుళ్లపై 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కించిన తర్వాత మరో విడతలో 14 టేబుళ్లపై ఇంకో 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఇలా ఓటర్ల సంఖ్యను బట్టి రౌండ్లు పెరుగుతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని చార్మినార్ నియోజకవర్గంలో 198 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 15 రౌండ్లతో లెక్కింపు పూర్తవుతుంది. ఈ విధానంలో లెక్కింపు అతిత్వరగా పూర్తయి ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. పోలింగ్ సెంటర్లను బట్టి రౌండ్ల సంఖ్య 25 వరకు పెరగవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 2,815 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగాయి.