తెలంగాణలో హోరాహోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. అందరి చూపు ఇప్పుడు కౌంటింగ్‌పైనే పడింది. ఎవరెవరు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి తోడుగా, ముఖ్యనేతలకు ఎంత మెజార్టీ దక్కనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో కే తారకరామారావు సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో వచ్చినదానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పారు. ఓటింగ్‌లో పెద్దఎత్తున పాల్గొన్నవారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లు చైతన్యాన్ని, విజ్ఞతను ప్రదర్శించారన్నారు. గతంలోకంటే ఓటింగ్ శాతం పెరుగడంతో అభివృద్ధికి మద్దతిచ్చినట్టయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సిరిసిల్లలో 75వేల మెజార్టీతో గెలుస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఆయన తెలివితేటల గురించి దేశం మొత్తం తెలుసునన్నారు. ప్రజలు మాత్రం ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉందని అన్నారు. ఈవీఎంల విధానంలోనే కాంగ్రెస్ రెండుసార్లు గెలిచింది.. మరి ఆ విషయంలో ఏమంటారు? అని ప్రశ్నించారు. బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లురావని అనేకమార్లు చెప్పామని, ఇప్పుడు అదే నిజం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. ఫెడరల్‌ఫ్రంట్, ఇతర విషయాలపై ఈ నెల 11న తరువాత మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు. చాలామంది ఓట్లు గల్లంతయ్యాయన్న కేటీఆర్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలనాటికి వాటిని సరిదిద్దాలని ఎన్నికలసంఘాన్ని పార్టీపరంగా కోరుతామని తెలిపారు.