ఏపీలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కనీస అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రాజెక్టులపై వైఎస్ జగన్ అసత్య ప్రచారానికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. వంశధార ఫేజ్-2 పనులపై ప్రతిపక్ష నేత అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రైతుల పంటలు ఎండిపోకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే తన తండ్రి వైఎస్ ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఉమ విమర్శించారు. భారత శిక్షా స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, అవన్నీ జగన్, విజయసాయి రెడ్డిపై నమోదయి ఉన్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తి అవినీతి రహిత పాలన అందిస్తానంటే నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదని వ్యాఖ్యానించారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని ఉమ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమా చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
