కేసీఆర్ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్–టీడీపీల పొత్తే.. కేసీఆర్ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మరోసారి బట్టబయలైయ్యింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలుచేసినా, పన్నాగాలు పన్నినా సీఎం కేసీఆర్ పక్షాన యావత్ తెలంగాణ సమాజం నిలబడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. డిసెంబర్ 11వ తేదీన గులాబీజెండా ఎగురబోతున్నదని, మళ్లీ కేసీఆరే అధికారం చేపట్టబోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పనితీరుకే ప్రజలు పట్టంకట్టారని స్పష్టంచేశారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణంతోపాటు గంభీరావుపేట మండలం గజసింగవరంలోని పోలింగ్‌స్టేషన్లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటించారు. కార్యకర్తలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీల నేతలు కూటమి కట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు ఏకమై వారిని తరిమికొట్టారన్నారు. డిసెంబర్ 11న అది తేటతెల్లం కాబోతున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరు, నిబద్ధతకే ప్రజలు మొగ్గుచూపారని విశ్లేషించారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసునని, కూటమికి తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.