తెలంగాణలో పోలింగ్ సమీపిస్తున్న వేళ.. నోట్ల కట్టలు వరదలా పారుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఒక్కరోజే పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం గమనార్హం. దీంతో నగరంలో నగదు తరలింపు వ్యవహారాలపై అటు పోలీసులు.. ఇటు ఎన్నికల స్పెషల్ టీమ్ డేగ కన్నేసింది.
బుధవారం రాత్రి.. నగరంలోని కూకట్పల్లి బాలాజీనగర్లో ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. మరోవైపు.. జూపూడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా పారిపోతున్న వారి నుంచి రూ. 17 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
జూపూడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు- పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.