వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నోటి దురుసు కారణంగా అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే అవుతారో కాదో అనే సందిగ్ద స్థితికి ఆయన చేరుకున్నారు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఇటీవల పోలీసు అధికారులు అన్ని పార్టీలకు చెందిన నాయకులకు సంబంధించిన నేతల నివాసాలపై సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ రచ్చ చేశారు. కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి, మా పదునేందో పట్టుదల ఏందో చూపిస్తామని రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఉద్యమకారుడు కాదు.. దగుల్బాజీ, దోపిడిదారుడు. నేనే రాజ్యం.. రాజ్యమంటేనే నేను అనేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్ ప్రజలతో గోక్కున్నవాడెవడూ బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు. చింతమడక చీటర్లకు కొడంగల్లో ప్రవేశం లేదని ఆరోపించారు. ఈనెల 4న కేసీఆర్ పర్యటన సందర్భంగా కొడంగల్ బంద్కు పిలుపునిచ్చారు.
అయితే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ సీఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. కొడంగల్ ప్రజలను ఆయన అకారణంగా రెచ్చగొడుతూ, తమ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొంది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోతో సహా ఆధారాలను అందచేసింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ వ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. రేవంత్ వ్యవహారంపై ఏం చర్యలు తీసుకున్నారో.. వివరణ ఇవ్వాలని రజత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీరియస్ అయిన నేపథ్యంలో..ఎమ్మెల్యే గిరికి అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.