జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌లు అనే పరిచయం అవసరం లేని సంగతి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు వీరిపై ఎంత భరోసా పెట్టుకొని వీరికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తే వారు పార్టీకే షాకిస్తున్నారనిప్రచారం జరుగుతోంది. స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేతలతో పాటు మరికొందరికి కాంగ్రెస్ చాన్సించింది. స్టార్ క్యాంపెయినర్లు అంటే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించాలి. కానీ, వీరితో పాటుగా కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు అందజేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ప్రచారక్షేత్రంలో ఎక్కడా కన్పించడం లేదు.
పై నేతలతో సహా మిగతా ముఖ్య నాయకులంతా, సొంత నియోజకవర్గంలోనే డక్కీమొక్కీలు పడుతున్న స్టార్ క్యాంపెయినర్లు గడపదాటి బయటికి రావడం లేదు. తమ నియోజకవర్గాల్లోనే అగ్రనేతల ప్రచారసభలు పెట్టించుకొనేందుకు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ దిగ్గజాలు అనుకున్నవారి రాతలే తలకిందులు కానున్నాయంటూ పలు సర్వేలు చెప్తుండటంతో స్టార్ క్యాంపెయినింగ్ దేవుడెరుగు.. ముందు ఇల్లు చక్కబెట్టుకుందామంటూ వారు నియోజకవర్గానికే పరిమితమయ్యారని పలువురు సెటైర్లు వేస్తున్నారు. కనీసం పక్క నియోజకవర్గం వైపు కూడా తొంగిచూడ లేనంత ఓటమి భయం వీరిని వెంటాడుతోందని , టీఆర్ఎస్ వేవ్‌లో తమ సీటు గల్లంతవడం ఖాయమనే ఆందోళన వారిని బాధిస్తోందని అంటున్నారు.