తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇకపై పూర్తిగా టీడీపీ అధినేత గుప్పిట్లోకి వెళ్లనుందా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు పని చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందా? ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కమలం పార్టీని వ్యతిరేకించిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి బద్ధ శతృవైన కాంగ్రెస్‌తోనే జతకట్టడంతో మహాకూటమీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లషకులు. దీనిపైనే అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్టీఆర్ నాడు ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టాడో ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం టీడీపీ కార్యకర్తలే జీర్ణించుకోలేకున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో ఎలా కలిసి పోటీచేస్తోందో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు వైఖరి తెలిసి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తన వినాశనం కొని తెచ్చుకుంటోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి తెలంగాణ పాలన జరుగుతుందని ఆరోపించాయి. అంతేకాదు ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సైతం అమరావతిలోనే తయారైందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జాబితాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తయారు చేశారని ,ఎప్పుడైతే ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబును తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారో అప్పుడే చంద్రబాబు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవడం స్పష్టమైందని అంటున్నారు.
