తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ముఖ్యనేత ఆయనకు కీలక సమయంలో ఝలక్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తలను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బరిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు.
కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టీజేఎస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. నేటి నుంచి పట్నం నరేందర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తామని వారు తెలిపారు. మహా కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడి ఉద్యోగులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని తాజాగా టీఆర్ఎస్ లో చేరిన టీజేఎస్ నేతలు పేర్కొన్నారు. కూటమిలో పొత్తు ధర్మం పాటించడం లేదని.. తమకు సరైన గుర్తింపు లేదని టీజేఎస్ నేతలు వాపోయారు. తెలంగాణ జన సమితికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆగ్రహాంతో టీజేఎస్ నేతలు కూటమికి గుడ్ బై చెబుతున్నారని అంటున్నారు.