గత ప్రభుత్వాల పాలనలో దోచుకున్నారు తప్ప.. ఏ ఒక్కరినీ ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాల ద్వారా పేదలను, రైతులను ఆదుకున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. దేశానికి వెన్నెముకైన రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు.
నియోజకవర్గ ప్రచారంలో పాల్గొన్న జగదీశ్ రెడ్డి కరెంటు అడిగితే కాల్చిచంపిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం దేనికి సంకేతమని, కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చంద్రబాబుకు వేసినట్లేనని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో సిండికేట్లతో ప్రజలపై అదనపుభారం మోపి వ్యాపారస్తులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని, నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికైన తరువాత దందాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్టవేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడంతో ప్రజలు ప్రశాతంగా జీవిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌కు కారుగుర్తుకు ఓటెయ్యాలని కోరారు.