టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వివిధ బ్యాంకుల నుంచి రూ.363 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టింది.
ఆడిటింగ్ లో ఈసంస్ధ తప్పుడుపత్రాలు, స్టేట్ మెంట్లు సమర్పించి రుణాలు పొందినట్లు గుర్తించిన బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ కి ఫిర్యాదు చేశాయి. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ సంస్ధలో ఫెమా ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది. దీంతో సీబీఐ ఈడీ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సంస్ధలో తనిఖీలు చేపట్టగా సుజనాచౌదరి స్ధాపించిన షెల్ కంపెనీల వివరాలు బయటపడ్డాయి. కాగా, ఈడీ సమన్లను రద్దు చేయాలని సుజనా వేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 2న కోర్టుకు హాజరుకావాలని సుజనాను ఆదేశించింది. ఈ నెల 24,27 తేదీల్లో సుజానా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇటీవల సుజనా నివాసాల్లో సోదాలు చేసిన అనంతరం ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు రద్దు చేయాలని సుజనా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయగా ఆ పిటీషన్ కు కోర్టు కొట్టివేసింది.