నవంబరు 29, 2009..! ప్రపంచ చరిత్రలో సమున్నతంగా నిలిచిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్రాత్మక రోజు..! ఆత్మగౌరవ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘట్టం..! స్వరాష్ట్ర ఉద్యమానికి కొండ గుర్తు..! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. సమైక్య పాలకుల దాష్టీకానికి ఉద్యమ సారథి గీసిన లక్ష్మణ రేఖ..! ఆరు దశాబ్దాల తెలంగాణ అరిగోసకు చరమగీతం పాడిన అకుంఠిత దీక్ష…! నాలుగు కోట్ల ప్రజల కోసం గులాబీ దళపతి ప్రాణాలు పణంగా పెట్టిన రోజు..! తెలంగాణ ఉద్యమాన్నిఉత్తుంగ తరంగంలా ఉవ్వెత్తున జ్వలింపజేసిన మహాద్భుత సన్నివేశం..! ఆత్మగౌరవ విశ్వరూపాన్ని హస్తినకు చూపించిన మహోజ్వలిత సందర్భం..! ఒక్కసారి తలుచుకుంటే చాలు… ఇప్పటికీ తెలంగాణ హృదయాల్లో పోరాట స్పూర్తి జ్వలింపజేసే అజరామరమైన జ్ఞాపకం..! దీక్షా దివస్.
ఆరు దశాబ్దాలు దగా పడ్డ తెలంగాణ… సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో కన్నీరు పెడుతున్న తరుణంలో కేసీఆర్ ఒక్కడై బిగించిన పిడికిలి మలిదశ ఉద్యమానికి బీజం వేస్తే… ఆ ఉద్యమంలో ఉగ్రరూపానికి ప్రతీక దీక్షా దివస్.. 2009లో రెండో సారి కాంగ్రెస్ అధికారం చేపట్టి… తెలంగాణ వాదాన్ని సమైక్య నాయకులు విచ్ఛిన్నం చేసే కుట్రల నడుమ… కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమైన సందర్భమది..! ఢిల్లీలో లాబీయింగ్ రాజకీయాలతో, డబ్బు సంచుల మూటలతో ఉద్యమాన్ని నీరు గారుస్తున్న వేళ… యావత్ తెలంగాణ నైరాశ్యంలో మునిగిన తరుణమది..! ఈ పరిస్థితుల్లో తుఫానుకు ముందు ప్రశాంతతలా… అప్పటి వరకు మౌనంగా ఉన్న ఉద్యమ నేత ఒక్కసారిగా జంగు సైరన్ సాగించిన సందర్భం..! కేసీఆర్ శవయాత్రో… తెలంగాణ విజయయాత్రో… అంటూ ఆమరణనిరాహార దీక్షకు పూనుకున్న రోజు..! బక్కపలచని తనువొక్కటి… ఉక్కు సంకల్పంతో… బాపూజీ స్పూర్తితో… తెలంగాణ స్వేచ్ఛ కోసం తెగించిన రోజు..! ఫలితంగా యావత్ తెలంగాణ ఒక్కటై గర్జించింది..! సబ్బండ వర్ణాలు సమర నినాదం పూరించాయి..! నాలుగు కోట్ల హృదయాలు జై తెలంగాణ అంటూ నినదించాయి..! దీక్షా దివస్ ఫలితంగా ఢిల్లీ నాయకులు దిగి రాక తప్పలేదు..! డిసెంబరు 9న అర్ధరాత్రి వేళ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయడం… ఆ తర్వాత కృత్తిమంగా పుట్టిన సమైక్య ఉద్యమంతో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవడం… కడుపు రగిలిన తెలంగాణ మరోసారి పోరు సాగించడం… ఇవన్నీ స్వరాష్ట్ర సాధనలో కీలక ఘట్టాలు..! కానీ వీటన్నింటికీ మూల మలుపు దీక్షా దివస్..! నాటి సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష ఫలితంగానే… తెలంగాణ స్వప్నం సాకారమైంది..! చరిత్రలో ఇది ఎప్పటికీ చెరిగిపోని ఏకశిలా శాసనం.
తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వేళ మరోసారి పాత పాట పాడుతున్న సందర్భం. కానీ తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరో ఇచ్చింది కాదు..! పోరాడి తెచ్చుకున్నది. కేసీఆర్ దీక్ష ఫలితంగా యావత్ తెలంగాణ ఏకమవటంతో.. గత్యంతరం లేక నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నాలుగు కోట్ల ప్రజలంతా తెలంగాణ ఇచ్చిన వారిని కాకుండా… తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తమ హృదయాల్లో నిలుపుకున్నారు.