సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందుతోంది. తెరాస ఎన్నికల మేనిఫెస్టో తుది ముసాయిదాను ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన కమిటీ పలు ప్రతిపాదనలతో 400 పేజీల నివేదిక రూపొందించి సీఎంకు సమర్పించింది.
మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు, సలహాలను ఒక భాగంలో, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో రూపొందించిన ప్రతిపాదనలను మరో భాగంలో పొందుపరిచారు. కమిటీ తరఫు సిఫార్సులను మూడో భాగంలో చేర్చారు. ఈ సందర్భంగా కేశవరావు, ప్రణాళిక కమిటీ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డిలతో సీఎం సమావేశమై మేనిఫెస్టో విడుదల విషయమై చర్చించారు.త్వరలో ఈ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.