తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ చేతిలో బక్రా అయిపోయార?సాక్షాత్తు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ చేతిలోనే ఆయన వెన్నుపోటుకు గురవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం వరంగల్ నగరంలోని ఏకశిలానగర్‌లో ఉన్న టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యతోపాటు పలువురు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని ఆరోపించారు. తమకు కేటాయించిన స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలిపి పొత్తుధర్మాన్ని విస్మరించిందన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వద్దిరాజు రవిచంద్రను నిలిపి కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మాన్ని పాటించలేదని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. చర్చల పేరిట కాలాయాపన చేస్తూ సీట్ల పంపకాల్లో తమకు అన్యాయం చేశారని ఆరోపించారు.మొదట ఇచ్చిన మాట ప్రకారం కాకుండా సీట్లను తగ్గించి కేటాయించారన్నారు. నామినేషన్ చివరిరోజున తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను నిలిపి బీ ఫారాలు అందజేసిందని చెప్పారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిలిపిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటమి తప్పదని స్పష్టంచేశారు. మందీమార్బలం, డబ్బులు ఉన్నాయని వరంగల్ తూర్పులో కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపినా.. తమ అభ్యర్థి గాదె ఇన్నయ్యను గెలిపించుకుంటామని తెలిపారు. కాగా, ఓటమిఖరారు అయినందునే కోదండరాం ఆవేద భరితంగా మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.