ఓ వైపు ఫ్యాన్స్..మరోవైపు సోదరి…ఓవైపు కుటుంబ రాజకీయం మరోవైపు….అండగా నిలుస్తున్న అభిమానులు..ఏది తేల్చుకోవాలి….ఇది ఇప్పుడు నందమూరి తారకరామారావు జూనియర్ పరిస్థితి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్‌తో ఆయన ఏం చేయాలో తేల్చుకోలేని దుస్థితి. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో దింపిన బాబు ఎత్తుగడతో ఎన్టీఆర్ ఈ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గం విషయంలో అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని కాదని, సుహాసినికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని, ఆ ప్రభావం మొత్తం నందమూరి కుటుంబంపై ఉంటుందని బాబు స్కెచ్ వేశారు.దీంతో ఆమె పోటీ చేసేందుకు సిద్దమై నామినేషన్ వేశారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అయితే, నందమూరి సుహాసిని నామినేషన్ సమయంలోనే, ఆమె బరిలోకి దిగడం ఎన్టీఆర్‌కు సహా ఆయన సోదరుడైన కళ్యాణ్ రామ్‌కు నచ్చలేదనే టాక్ వచ్చింది. కానీ దీన్ని కవర్ చేసుకునేందుకు సోదరులిద్దరూ శుభాకాంక్షలు తెలిపి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడుప్రచారం సమయంలో ఎన్టీఆర్ ముందుకు సంకట స్థితి వచ్చిపడింది.
ఎందుకంటే..చంద్రబాబు కనుసన్నల్లో గతంలో ఎన్టీఆర్‌పై జరిగిన కుట్రలను పలువురు ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అరవింద సమేత విజయోత్సవానికి వచ్చిన బాలకృష్ణ ఆ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవడం పలువురిని కలచి వేసింది.
అంతకుముందు హరికృష్ణ మరణం సమయంలో ఆయన మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకువెల్లకుండా అడ్డుపడ్డారనే టాక్ ఉంది. కొద్దికాలం కిందట టీడీపీతో సఖ్యతలేని సమయంలో…ఎన్టీఆర్ చిత్రాలని నిషేధించాలంటూ ప్రచారం జరగడాన్ని ఎన్టీఆర్ అభిమానులు ఇంకా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు టాక్. తారక్ అభిమానుల మాటకు విలువ ఇస్తారా? లేకపోతే అక్కకు మద్దతుగా ప్రచారం చేస్తారా అనేది ఎదురు చూడాల్సిందే.