శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నేటి నుంచి గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారపర్వం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు తోడుగా ప్రచారంచేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే కేశవరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కే తారకరామారావు, హరీశ్‌రావు, ఎంపీలు బీ వినోద్, బండ ప్రకాశ్, జే సంతోష్‌కుమార్, వేణుగోపాలాచారి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాంబాబుయాదవ్, ఆర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
ఇదిలాఉండగా, ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్కో జాతీయ పార్టీ తరఫున 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు, ప్రాంతీయ పార్టీ తరఫున 20 మంది స్టార్ క్యాంపెయినర్లకు అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం 15 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన టీఆర్‌ఎస్ మరో ఐదుగురిని ప్రకటించాల్సి ఉంది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చులను సంబంధిత రాష్ట్ర పార్టీ ఖాతాలో జమచేస్తారు. వీరు ఎక్కడ ప్రచారం చేసినా ఆ మొత్తం ఖర్చును రాష్ట్ర కమిటీలు విధిగా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.