రాజకీయ విశ్లేషకుల చూపంతా ఇప్పుడు తెలంగాణభవన్…గాంధీభవన్ వైపు పడింది. తెలంగాణ భవన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కేంద్ర కార్యాలయం కాగా…గాంధీభవన్ హస్తం పార్టీ యొక్క రాష్ట్ర కార్యాలయం అనే సంగతి తెలిసిందే. ఇది తెలిసిందే కదా? ఇందువల్లే విశ్లేషకుల చూపు ఆయా పార్టీ కార్యాలయాల వైపు పడుతోందా? అని ఆలోచించకండి. ఇది కాదు కారణం..సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం చేరికల జోష్‌తో కలకలలాడుతుంటే…గాంధీభవన్ వెలవెలబోవడమే కాదు బిక్కుబిక్కుమంటోంది కూడా.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ జట్టుకట్టాయి. ఉమ్మడిగా పోటీ చేసే కార్యాచరణను రూపొందించాయి. అయితే, పొత్తుల పర్వంలో టికెట్లు దక్కని నేతలు పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. దిష్టిబొమ్మల దహనం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరును దుయ్యబడుతూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ ఉంది. ఇతర పార్టీల నేతల చేరికలతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కలకలలాడుతోంది. నామినేషన్లకు ఒక్కరోజు ముందు కూడా మంత్రి కేటీఆర్ సమక్షంలో చొప్పదండి, వేములవాడ, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో ఆదివారం తెలంగాణభవన్‌కు తరలివచ్చి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థూలంగా ఇతర పార్టీల నేతల చేరికలతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కలకలలాడుతుంటే….. అంతర్గత అసంతృప్తులకు భయపడి బౌన్సర్లతో కాంగ్రెస్ కార్యాలయం బిక్కుబిక్కుమంటోంది.